Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-01 22:19:10
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తిరుమల గిరుల్లో ఎన్నో పవిత్ర తీర్థాలు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి ఈ తీర్థాలకు ముక్కోటి పేరిట ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొంటే పాపాలు నశించి పుణ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ సందర్భంగా ఈ ఏడాది తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడు జరుగనుంది? చక్రతీర్థ ముక్కోటిని ఎలా నిర్వహిస్తారు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడు?
ప్రతి ఏడాది మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున తిరుమలలో చక్రతీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ద్రవిడ సంప్రదాయం ప్రకారం ఇది కార్తిక ద్వాదశి అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 2, మంగళవారం మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున తిరుమలలో ఈ ఉత్సవం జరుగనుంది.
చక్రతీర్థ ముక్కోటి విశిష్టత
తిరుమలలో జరిగే ఉత్సవాలలో చక్రతీర్థ ముక్కోటి అత్యంత ప్రముఖమైనది. వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని కళ్లారా వీక్షించిన భక్తులకు సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారని తెలుస్తోంది. ఇంతకూ తిరుమల గిరుల్లో ఈ చక్రతీర్థం ఎక్కడుంది?
తిరుమలలో చక్రతీర్థం ఎక్కడుంది?
తిరుమల వేంకటేశ్వరస్వామి వెలసిన శేషగిరులమీద దక్షిణ భాగంలో మహా పవిత్ర తీర్థమైన చక్రతీర్థం ఉంది. వరాహ పురాణం ప్రకారం తిరుమలలోని శేష గిరులలో వెలసిన 66 కోట్ల తీర్థాల్లో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాల్లో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా విరాజిల్లుతోంది.
చక్రతీర్థ పురాణ ప్రాశస్త్యం
తిరుమలలో వెలసిన చక్రతీర్థానికి పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగిపుంగవుడు చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారట. పద్మనాభ మహర్షి తపస్సుకు మెచ్చి వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఈ కల్పాంతం వరకు ఇక్కడే తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు.
చక్రతీర్థం పేరు ఇలా వచ్చింది.
స్వామి ఆదేశం మేరకు పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేస్తున్న సమయంలో ఓ రాక్షసుడు మహర్షిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు వేంకటేశ్వరస్వామి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడిని సంహరించారని పురాణాలు చెప్తున్నాయి. అనంతరం ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలో శాశ్వతంగా ఉండమని ఆఙ్ఞాపించారంట. స్వామి వారి ఆజ్ఞ మేరకు ఆనాటి నుంచి సుదర్శన చక్రం అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది. ఆనాటి నుంచి ఈ తీర్థం చక్రతీర్థం గా ప్రసిద్ధిగాంచింది.
అంతా శాస్త్రోక్తంగా
చక్రతీర్థ ముక్కోటి సందర్భంగా ఉత్సవం నిర్వహించే రోజు ఉదయం శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు మంగళ వాయిద్యాలతో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రదక్షిణంగా చక్ర తీర్థానికి వెళ్తారు. చక్రతీర్థంలో వెలసిన చక్రత్తాళ్వారువారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి, భక్తులకు ప్రసాదాలు పంచి పెడతారు. ఉత్సవం పూర్తయ్యాక తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.
జన్మరాహిత్యం
ఏడాదికి ఒకసారి జరిగే ఈ చక్రతీర్థ ముక్కోటి చూడటానికి భక్తులు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి విశేషంగా తరలి వస్తారు. ఈ చక్ర తీర్థ ముక్కోటి ని కళ్లారా చూసిన వారికి జన్మరాహిత్యం కలిగి మోక్షం సిద్ధిస్తుందని పురాణ వచనం. ఈ ఒక్కరోజు మాత్రమే కాకున్నా ఏడాది మొత్తం శ్రీవారి దర్శనానికి వెళ్లిన యాత్రికులు చక్ర తీర్ధాన్ని కూడా దర్శించి తరిస్తుంటారు.