Responsive Header with Date and Time

శ్రీహరి అనుగ్రహానికి అత్యంత శుభదినం– మత్స్య ద్వాదశి రోజున ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయ్!

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-01 23:01:33


శ్రీహరి అనుగ్రహానికి అత్యంత శుభదినం– మత్స్య ద్వాదశి రోజున ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయ్!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. మహాప్రళయం సమయంలో వేదాలను కాపాడటానికి విష్ణువు మత్స్యావతారం ధరించారని పురాణాలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో శుద్ధ ద్వాదశి రోజునే శ్రీహరి మత్స్యావతారాన్ని స్వీకరించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ రోజును మత్స్య ద్వాదశిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మత్స్య ద్వాదశి ఎప్పుడు? ఆ రోజు శ్రీహరిని ఎలా పూజించాలి? ఈ రోజు చేపలకు ఆహారం ఇవ్వడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భగవత్ స్వరూపం - మార్గశిరం  శ్రీకృష్ణుడు భగవద్గీతలో తానే మార్గశిరమని ప్రకటించుకున్నాడు. అందుకే మార్గశిర మాసాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక సాధనకు అనువైన మార్గశిర మాసం పండుగలకు పుట్టినిల్లు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటే మరుసటి రోజు ద్వాదశి నాడు మత్స్య ద్వాదశిగా జరుపుకుంటాం. ఇదే రోజున శ్రీహరి వేదాలను సంరక్షించడానికి మత్స్యావతారం స్వీకరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మత్స్య ద్వాదశి విశిష్టతను తెలుసుకుందాం.

మత్స్య ద్వాదశి ఎప్పుడు

డిసెంబర్ 2, మంగళవారం మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

మత్స్య ద్వాదశి విశిష్టత

పురాణాల ప్రకారం హయగ్రీవుడనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్రంలో దాక్కుంటాడు. భూమిపై ధర్మం నాలుగు పాదాలపై నడవడానికి అవసరమైన వేదాలు లేకపోవడంతో లోకంలో ధర్మం నశించి అధర్మం పెచ్చు మీరింది. అప్పుడు శ్రీహరి మత్స్యావతారాన్ని ధరించి హయగ్రీవుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పజెప్పుతాడు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి హయగ్రీవుని సంహరించిన మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ రోజు శ్రీ మహా విష్ణువును పూజించడం శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి.

మత్స్య ద్వాదశి పూజ ఎలా చేయాలి?  మోక్షదా ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజైన మత్స్య ద్వాదశి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. నాలుగు రాగి కలశాలలోకి గంగాజలాన్ని తీసుకొని అందులో పువ్వులు, అక్షింతలు వేసి పూజా స్థలంలో ప్రతిష్టించాలి. ఇప్పుడు నాలుగు కలశాలను నువ్వులతో కప్పి, వాటి ముందు పసుపుతో తయారు చేసిన విష్ణువు స్వరూపాన్ని తమలపాకులో ఉంచాలి. ఈ నాలుగు కలశాలను నాలుగు సముద్రాలకు ప్రతీకగా చెబుతారు.

కలశపూజ

కలశాలు సిద్ధం చేసుకున్న తరువాత విష్ణువు ముందు ఆవునేతితో దీపారాధన చేయాలి. అక్షింతలు, పసుపురంగు పూలు, తులసీదళాలతో అర్చించాలి. అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చివరగా చేతిలో తులసిమాల ధరించి, ఓం మత్స్య రూపాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూజ పూర్తయ్యాక శ్రీహరికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇవ్వాలి. అనంతరం శ్రీహరి మత్స్యావతార కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. పూజ పూర్తయ్యాక ఈ నాలుగు కలశాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం.

చేపలకు ఆహారం మత్స్య ద్వాదశి రోజున దేవాలయ ప్రాంగణాలలో ఉన్న కోనేరులలో, ఉరి చివర ఉన్న చెరువులలో, జీవ నదుల్లో చేపలకు గోధుమ పిండి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆహారంగా సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్త జాతక దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.