Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-02 22:14:51
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : మార్గశిర మాసంలో చేసే చిన్న పుణ్య కార్యమైనా విశేష ఫలాన్ని ఇస్తుంది. ఇక ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం చేసే మార్గశిర గురువార వ్రతం, అవివాహితులకు కల్యాణ యోగాన్నిచ్చే శ్రీ వ్రతం ఇలా ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఇదే మాసంలో శత్రు భయాన్ని పోగొట్టే మరొక వ్రతం కూడా ఉంది. అదే హనుమద్వ్రతం. సాక్షాత్తు శ్రీరాముడు స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి రావణుని పై విజయం సాధించాడని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తోంది. ఇంతకూ ఈ హనుమద్వ్రతం ఎప్పుడు? ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హనుమద్వ్రతం ఎప్పుడు?
మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమద్వ్రతం ఆచరించాలి. ఈ ఏడాది డిసెంబర్ 3, బుధవారం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమద్వ్రతం ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
హనుమద్వ్రతం విశిష్టత
అత్యంత శక్తివంతమైన హనుమద్వ్రతం ఆచరించడం వల్ల కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుందని విశ్వాసం. జీవితంలో భరించలేని కష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతం ఆచరించడం వలన హనుమ అనుగ్రహంతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. హనుమద్వ్రతం ఆచరించడం వెనుక ఉన్న పురాణగాథను తెలుసుకుందాం.
పాండవులకు వ్యాస మహర్షి సూచన
పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వ్యాస మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులతో సహా మహర్షికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. అప్పుడు వ్యాసుడు సంతోషించి ధర్మరాజుతో \"ఓ ధర్మరాజా! సకల జయాలను కలిగించే అతి రహస్యమైన వ్రతం ఒకటుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతారు. ఈ వ్రతం సత్వరమే కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని\" చెప్పాడు. అదే శ్రీ హనుమద్వ్రతం. ఈ వ్రతం దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుంది కాబట్టి వెంటనే ఈ వ్రతాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు.
ద్రౌపది ఆచరించిన హనుమద్వ్రతం - అర్జునుని ఆగ్రహం
పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుని సలహా మేరకు ద్రౌపది ఆచరించింది. వ్రతంలో భాగంగా ద్రౌపది చేతికి కట్టుకున్న తోరాన్ని చూసి అర్జునుడు \"ఇది ఏమిటి?\" అని అడుగగా, ద్రౌపది హనుమద్వ్రతం గురించి వివరించింది. అప్పుడు అర్జునుడు \'కోతి కోసం వ్రతం ఏమిటి?\' అని హనుమద్వ్రతాన్ని చులకన చేసి ద్రౌపది చేతికి ఉన్న తోరాన్ని తీసి వేసాడు. ఆ ఫలితంగానే వారు ఎన్నో కష్టాలు పడ్డారు. రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యాలు పాలయ్యారని వ్యాస మహర్షి పాండవులకు చెప్పి, తిరిగి వారిచే ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తాడు.