Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-02 22:42:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : ఆది పూజలు అందుకునే దేవుడు వినాయకుడు. గణపతి మంగళ కరుడు. అందుకే ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం సంప్రదాయం. సకల ప్రమథ గణాలకు అధిపతి అయిన వినాయకుని పూజిస్తే కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుందని విశ్వాసం. వినాయకుని ఆలయం లేని ఉరంటూ ఉండదు. అయితే కొన్ని గణపతి ఆలయాలు చేధించలేని మిస్టరీలతో శాస్త్రజ్ఞులకు సవాల్ విసురుతున్నాయి. అలాంటి ఒక మహిమాన్వితమైన గణపతి ఆలయం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం
విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో వెలసిన స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలసినట్లుగా తెలుస్తోంది. సుమారు 200 ఏళ్ల నుంచి ఈ ఆలయంలో గణనాథుడు పూజలు అందుకుంటున్నారు.
ఉత్తరాంధ్ర కాణిపాకం
చోడవరం గణపతి ఆలయంలో వెలసిన స్వామి వారిని కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఈ వినాయకుడిని దర్శించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసుల కాణిపాకంగా వ్యవహరిస్తారు.
భక్తుల పాలిట కొంగు బంగారం
చోడవరం కార్యసిద్ధి వినాయకుడు తనను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీరుస్తూ వారి పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు.
స్థల పురాణం
సుమారు 200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గొల్లలు గొర్రెలను కాస్తుండగా ఒక గొయ్యిలో నుంచి వినాయకుని విగ్రహం అకస్మాత్తుగా పైకి వచ్చి దర్శనం ఇచ్చిందంట! అలా స్వయంభువుగా వెలసిన ఆ వినాయకునికి ఆ ప్రాంత పెద్దలందరూ కలిసి ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆనాటి నుంచి ఈ గణపతి ఆలయాన్ని ఎందరో భక్తులు సందర్శించి తమ అభీష్టాలను తీర్చుకున్నారు.
సైన్స్‌కు అందని మిస్టరీ!
చోడవరంలోని స్వయంభూ కార్యసిద్ధి విఘ్నేశ్వరుడి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. గర్భ గుడిలో ఈ వినాయకుడు నడుము పైభాగం వరకు మాత్రమే దర్శనమిస్తాడు. వినాయకుడి తొండం భూమిలోకి చొచ్చుకుపోయినట్లుగా ఉంటుంది. అయితే ఇక్కడి వినాయకుని తొండం ఆలయం పక్కనే ఉన్న చెరువు వరకూ విస్తరించి ఉంటుందని భక్తులు చెబుతున్నారు.
గర్భాలయంలో నిరంతరం నీరు
గర్భగుడిలోకి నిరంతరం స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంటుంది. చెరువులోని నీరు వినాయకుని తొండం ద్వారానే గర్భ గుడిలోకి వస్తుందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ నీటిని స్వామి వారి అభిషేకం, ఇతర కైంకర్యాలకు వినియోగించడం విశేషం.