Responsive Header with Date and Time

పదో తరగతి పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్ధుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు!

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-12-02 23:06:58


పదో తరగతి పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం.. ఇక విద్యార్ధుల మార్కుల ఆధారంగానే టీచర్లకు గ్రేడ్లు!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :  రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రతీయేట రాష్ట్రంలో పదో తరగతి విద్యార్దుల ఉత్తీర్ణత శాతం ఘననీయంగ పడిపోతుంది. ఈసారి ఉత్తీర్ణత పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతిలో విద్యార్థులు సాధించిన సరాసరి మార్కుల ఆధారంగా ఆయా బడుల్లోని సబ్జెక్టు టీచర్లకు గ్రేడ్లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటన వెలవరించింది. ఉపాధ్యాయుల అవార్డులకు సైతం దీన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నట్లు పేర్కొంది.

పదో తరగతి పరీక్షలపై జిల్లా అధికారులతో ఉన్నతాధికారులు డిసెంబరు 1న ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈసారి జరగనున్న పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌ డ్యూటీలను రాష్ట్రస్థాయి నుంచే పంపనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనానికి సైతం రాష్ట్రస్థాయి కార్యాలయం నుంచే ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో విద్యార్థి సమాధానపత్రాన్ని మూల్యాంకనం చేసేందుకు కనీసం 12 నుంచి 15 నిమిషాలు కేటాయించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

అలాగే డిసెంబరు 15 తర్వాత పదో తరగతి విద్యార్థులెవ్వర్నీ ఇతర కార్యకలాపాలకు వినియోగించకూడదని, ప్రతిరోజూ వారికి పరీక్ష నిర్వహించి, మార్కులను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ నిర్వహించే స్లిప్‌టెస్ట్‌ సమాధానపత్రాలను పబ్లిక్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ఆయా స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులు భద్రపరచాలని సూచించారు. విద్యార్థులను దత్తత తీసుకునే విధంగా రాష్ట్రస్థాయి నుంచే సూచనలు చేస్తారు.