Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-03 22:07:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : గురుతత్వం, దైవత్వం మేలు కలయిక దత్తాత్రేయ స్వరూపం. త్రిమూర్తుల అవతార స్వరూపం దత్తాత్రేయుని ఆరాధిస్తే ఇటు గురువును, అటు దైవాన్ని ఇద్దరినీ ఆరాధించినట్లే! దత్తాత్రేయుని జన్మ మాత్రమే కాదు ఆయన జీవితం కూడా అపురూపమైనది. దత్తాత్రేయ స్వరూపం మాములు స్వరూపం కాదు. అది సచ్చిదానంద స్వరూపం. మార్గశిర పౌర్ణమి శ్రీదత్త జయంతి సందర్భంగా దత్త జయంతి ఎప్పుడు? ఆరోజు దత్తాత్రేయుని ఎలా పూజించాలి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ దత్త జయంతి ఎప్పుడు?
ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటాం. ఈ ఏడాది డిసెంబర్ 4, గురువారం మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజును దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈసారి గురువారం దత్తజయంతి రావడం మరింత శుభకరమని పండితులు చెబుతున్నారు.
ఎవరీ దత్తాత్రేయుడు?
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో అవతరించిన దివ్యమూర్తి దత్తాత్రేయుడు. తపఃశక్తికి ప్రతీక అయిన అత్రిమహర్షికి, అసూయకు తావులేని సాధ్వీమణి అనసూయ దంపతుల వర పుత్రుడు దత్తాత్రేయుడు.
విశ్వగురువు
దత్తుడు బాల్యం నుంచే అనేక లీలలు ప్రదర్శిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఎందరో మహర్షులకు యోగ విద్య నేర్పించే విశ్వ గురువయ్యాడు. తన తల్లి అనసూయకు ఆత్మజ్ఞానాన్ని బోధించి ఆమె జన్మను చరితార్థం చేసాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ, తన భక్తుల లౌకిక పరమైన కోరికలు తీరుస్తూనే వారిని యోగ మార్గంలో పయనించేలా చేసిన విశ్వగురువు దత్తాత్రేయుడు. సహ్యాద్రి పర్వత గుహల్లో తపస్సు ఆచరించి లోకానికి తపస్సు, ఆధ్యాత్మిక సాధనాల ప్రాధాన్యాన్ని తెలియజేసాడు.
సచ్చిదానంద రూపం
దత్తాత్రేయ స్వరూపం అపురూపమైనది. మూడు శిరస్సులు, ఆరు చేతులతో భిక్షుక రూపంలో దర్శనమిచ్చే దత్తాత్రేయుని స్వరూపాన్ని దర్శిస్తే చాలు అజ్ఞానం, అహంకారం పటాపంచలై పోతాయని విశ్వాసం. ఎప్పుడూ ఔదుంబర అంటే మేడి చెట్టు నీడలో ఉండే దత్తాత్రేయుడు మానవులలో మేడిపండు తత్వాన్ని తెలియజేసే జ్ఞానమూర్తి.
ఎందరికో ఆత్మజ్ఞాన బోధ
దత్తాత్రేయ స్వామి కేవలం మానవులకు మాత్రమే గురువు కాదు. దేవతలకు, ఋషులకు జ్ఞానబోధ చేసిన అవతారపురుషుడు. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మరచిపోతే దత్తుడే ఆయనకు వేద బోధ చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే కార్త్య వీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేసి వెయ్యి చేతులు, నిత్య యవ్వనాన్ని వరంగా పొందినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే భక్త ప్రహ్లాదునికి ముని రూపంలో ఆత్మజ్ఞానాన్ని బోధించిన విశ్వగురువు దత్తాత్రేయుడు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య కూడా తిరుమల వేంకటేశ్వరస్వామిలో దత్తాత్రేయుని దర్శించి కీర్తించినట్లుగా మనకు తెలుస్తోంది.
దత్తాత్రేయుని గురువు ఎవరో తెలుసా!
మరి ఇంతమందికి జ్ఞానబోధ చేసిన దత్తాత్రేయుని గురువు ఎవరో తెలుసా! దత్తాత్రేయుడు తన ఆత్మనే గురువుగా భావించినప్పటికీ, తన జీవిత ప్రయాణంలో తనకు ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదించిన 24 చరాచరాలను తన గురువులుగా పేర్కొన్నాడు.
దత్తాత్రేయుని గురువులు వీరే!
భూమి, ఆకాశం, గాలి, నీరు, వాయువు, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, తేనెటీగ, తేనెటీగలు పెంచేవాడు, గద్ద, సముద్రం, చిమ్మట, ఏనుగు, శిశువు, చేప, వేశ్య, కన్య, సర్పం, విలుకాడు, సాలీడు, జింక, గొంగళిపురుగు ఇవన్నీ కూడా దత్తాత్రేయుని గురువులే! ప్రకృతిలోని ప్రతి ఒక్క ప్రాణి నుంచి, ప్రతి ఒక్క వస్తువు గురించి ఎంతో కొంత జ్ఞానం పొందవచ్చని తెలియజేయడానికి దత్తాత్రేయస్వామి వీటిని గురువుగా భావించాడు.