Responsive Header with Date and Time

కామాక్షి అమ్మవారి ఆలయం- ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే సంతాన సమస్యల నుంచి విముక్తి!

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-04 22:09:01


కామాక్షి అమ్మవారి ఆలయం- ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే సంతాన సమస్యల నుంచి విముక్తి!

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :  కామాక్షి అనగానే అందరికీ ముందుగా కంచి గుర్తుకు వస్తుంది. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సమీపంలోని జొన్నవాడ గ్రామంలో స్వయంభువుగా వెలసిన కామాక్షితాయి భక్తుల పాలిట కల్పవల్లి. ఈ తల్లిని ఆశ్రయిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ కథనంలో జొన్నవాడ కామాక్షితాయి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.

జొన్నవాడ కామాక్షితాయి ఆలయం ఎక్కడుంది?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నానది తీరంలో కామాక్షి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. 1150లో నిర్మించిన ఈ ఆలయంలో కామాక్షితాయితో పాటు శ్రీ మల్లికార్జున స్వామి కూడా కొలువై ఉన్నారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ \"శ్రీచక్రం\" ప్రతిష్ఠించారని ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే కామాక్షిదేవి సన్నిధిలో భక్తులు తమ సమస్యలను విన్నవించుకుని, ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయని విశ్వాసం.

ఆలయ స్థల పురాణం
పూర్వం కశ్యప ముని లోక కళ్యాణం కోసం పౌండరీక యాగం నిర్వహించదలచాడు. అందుకు తగిన ప్రదేశం కోసం వెతుక సాగాడు. ఈ క్రమంలో పినాకినీ నదీ తీరం చేరుకుని ఈ ప్రదేశం యాగానికి సరైనదని భావించాడు. అక్కడే తూర్పు, నైరుతి, వాయవ్యాల్లో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేశాడు.

యాగకుండం నుంచి నరసింహుని ఆవిర్భావం
నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగ కుండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉన్నాడు. జొన్నవాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో వేదగిరి పుణ్యక్షేత్రం ఉంది.

లింగాకారంలో శివుడు
వాయువ్యాన ఉన్న యోగ కుండం నుంచి పరమ శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు. ఈ యుగ వాటికను రజతగిరి అని పిలిచే వారు అదే కాలక్రమేణా జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది.

కామాక్షిగా పార్వతి
ఇక కైలాసంలో శివుడు కనబడక పోవడంతో పార్వతి కంగారు పడింది. తన మనో నేత్రంతో జరిగినది తెలుసుకొని శివుడు ఉన్న చోటే తనకు కైలాసమని పేర్కొంటూ ఈ జొన్నవాడకు వచ్చి కామాక్షిగా కొలువై ఉందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది.

ఉగ్రస్వరూపిణిగా కామాక్షి
ఇక్కడ అమ్మవారు తొలుత ఉగ్రస్వరూపిణిగా ఉండేది. అయితే కొంతకాలం తరువాత జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ విషయం తెలుసుకుని జొన్నవాడ వచ్చి ఒక రాత్రి దేవాలయంలో పడుకొంటాడు. అర్థరాత్రి ఉగ్రస్వరూపంతో బయటకు వెళ్తున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్ధించి శాంతింపజేస్తాడు.

శ్రీచక్ర ప్రతిష్ఠాపన
అటుపై ఆదిశంకరులు తన శక్తినంతటినీ ధారపోసి శ్రీ చక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిని తన ఉగ్ర స్వరూపాన్ని విడిచి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా జొన్నవాడలోనే వెలసి ఉండాలని వరం కోరుతాడు. అప్పటి నుంచి అమ్మవారు కామాక్షితాయిగా పూజలందుకుంటోంది. \'తాయి\' అంటే ద్రావిడ భాషలో \'తల్లి\' అని అర్ధం. ఆనాటి నుంచి జొన్నవాడ కామాక్షిదేవిని తల్లిగా భావించి పూజలు జరపడం సంప్రదాయం మారింది.

ఆలయ విశేషాలు
కామాక్షి దేవి ఆలయంలోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపు ఉన్న మార్గంలో వెళితే పినాకిని నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలో దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాన్ని చేతబూనిన ద్వారపాలకులు దర్శనమిస్తారు. లోపల ఉన్న విశాలమైన లోగిలి దాటి ముందుకు వెళ్తే కల్యాణ మండపం కనిపిస్తుంది. కల్యాణ మండపానికి కుడివైపు కామాక్షి దేవి గర్భ గుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దాని పక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్లగానే అర్ధమండపంలో చాలా స్తంభాలుంటాయి.