Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-04 22:13:03
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : భక్తుల పాలిట పెన్నిధిగా భావించే ఆంజనేయస్వామికి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో గాథ ఉంటుంది. అయితే ఔరంగజేబునే గడగడలాడించిన ధ్యాన హనుమ వెలసిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా? హనుమంతుడు ధ్యానమూర్తిగా దర్శనమిచ్చే ఈ ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి
నిత్యం శ్రీరామ ధ్యానంలో ఉండే హనుమను ఆరాధిస్తే అన్ని రకాల భూత ప్రేత పిశాచ భయాలు పోగొడతాడని విశ్వాసం. ధ్యానముద్రలో స్వయంభువుగా ఆంజనేయస్వామి వెలసిన క్షేత్రమే హైదరాబాద్లోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం. ఎన్నో వందల ఏళ్ల నుంచి భక్తులను అనుగ్రహిస్తూ ధ్యానముద్రలో ఉండే ఈ హనుమను దర్శించుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడుంది?
హైదరాబాద్ నగరంలోని ఇన్నర్ రింగురోడ్డుకు సమీపంలో, దిల్‍సుఖ్‍నగర్, ఎల్బీనగర్కు దగ్గరలో కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం వెలసి ఉంది.
ఆలయ చరిత్ర
క్రీ.శ. 1148 లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాప రుద్రుడు వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. వేటాడి అలిసిపోయిన రుద్రుడు ఇక్కడ ఉన్న ఒక బండపై సేదతీరాడు. కాసేపటికి అతనికి ఒక పులి గాండ్రింపు వినిపిస్తుంది. అప్రమత్తమైన రుద్రుడు విల్లంబులు ధరించి శబ్దం వచ్చిన వైపుగా వెళ్లి చూస్తాడు. కానీ అక్కడ ఏమి కనిపించక పోవడంతో తిరిగి వచ్చి విశ్రమిస్తాడు. మరికాసేపటికి తిరిగి పులి గాండ్రింపు వినిపించడంతో ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా గాలిస్తాడు. అక్కడ ఎలాంటి జంతువు కనిపించదు కానీ రామ శబ్దం వినిపిస్తుంది. రామశబ్దం వినగానే రుద్రుడు భక్తితో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్ధిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ అదృశ్య మూర్తి స్వరం వినిపిస్తుంది. దాంతో రుద్రుడు అక్కడే దీక్షతో ధ్యానం చేయడం మొదలు పెడతాడు. కొంతసేపటి \'ఇక చాలు లే నాయనా!\' అనే శబ్దం వినిపిస్తుంది. అప్పుడు రుద్రుడు కళ్ళు తెరచి శబ్దం వినిపించిన దిక్కులో వెతకగా ధ్యానముద్రలో ఉన్న ధ్యానాంజనేయస్వామి విగ్రహం కనిపిస్తుంది.
ధ్యానాంజనేయస్వామికి ఆలయం నిర్మించిన రుద్రుడు
ధ్యానాంజనేయస్వామి విగ్రహం దర్శనంతో పరమానందం ప్రతాప రుద్రుడు ఆ విగ్రహానికి పూజలు చేసి తిరిగి తన మందిరానికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ప్రతాప రుద్రునికి స్వప్నంలో ధ్యానాంజనేయస్వామి వారు ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించామని ఆదేశిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ప్రతాప రుద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. తదుపరి కాలంలో కాకతీయ రుద్రులు ఇష్ట దైవంగా కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామిని పూజించడంతో స్వామి మహిమ నలుదిక్కులకూ వ్యాపించింది. ఆనాటి నుంచి ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.
తానే స్వయంగా బయల్దేరిన ఔరంగజేబు
తన సైన్యం అపజయం పాలయిన సంగతి తెలిసి ఔరంగజేబు స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆయుధాలతో, పెద్ద సైన్యంతో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం మీదకు దండెత్తి వెళ్తాడు. ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా ఆలయం లోపల నుంచి గంభీరమైన ఒక స్వరం బిగ్గరగా \'మందిర్ తోడ్ నా హైతో పహాలే తుమ్ కరో మన్ ఘట్\' అనే మాటలు వినిపిస్తాయి. అంటే \'ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ముందుగా నీ మనసును గట్టి చేసుకో\' అని అర్థం. ఆ స్వరం విన్న ఔరంగజేబు ధైర్యం ఉంటే తనకు కనపడమని సవాల్ చేస్తాడు. అప్పుడు తాటిచెట్టు కంటే ఎత్తయిన ఒక స్వరూపం ఔరంగజేబు ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ స్వరూపాన్ని చూసి భీతిల్లిన ఔరంగజేబు అక్కడ నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటాడు. ఆంజనేయస్వామి ఔరంగజేబుకు విసిరిన సవాల్ \'కరో మన్ ఘట్\' అనే మాటలే కాలక్రమేణా కర్మన్‌ఘాట్ గా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
పూజోత్సవాలు
కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రతిరోజూ నిత్యపూజలు జరుగుతాయి. ప్రతి రోజూ వందలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో వెలసి ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కూడా ఉంటాయి. కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి గర్భాలయంలో వెలసి ఉన్న ప్రశాంతమైన స్వామిని దర్శించుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోరుకునే వారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. మరో విశేషమేమిటంటే సంతానం లేనివారు కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామికి మూలవిరాట్ ను దర్శించుకుంటే సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డను ఎత్తుకుంటారని విశ్వాసం.