Responsive Header with Date and Time

వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతం : కార్యకర్తల సమావేశంలో లోకేశ్

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Politics Posted on 2025-12-04 22:16:00


వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతం : కార్యకర్తల సమావేశంలో లోకేశ్

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :  మిస్‌ఫైర్, క్రాస్‌ఫైర్, విడాకులు వంటివి మన పార్టీలో ఉండవని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. టీడీపీకి వ్యక్తులు శాశ్వతం కాదని, కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. రాబోయే పదిహేనేళ్లు పొత్తుతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో పాలకొండ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, పార్టీ నేతలతో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. తిరుమల పరకామణిలో రూ.50 కోట్లు చోరీ చేస్తే అది చిన్నదంటున్న జగన్‌ను దేవుడే చూసుకుంటాడని లోకేశ్​ అన్నారు. వైఎస్సార్​సీపీ వాళ్లు మెగా డీఎస్సీపై చాలా కేసులు పెట్టినప్పటికీ చిత్తశుద్ధితో 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. వైఎస్సార్​సీపీ ఐదేళ్ల పాలనలో సాధించలేని విశాఖ రైల్వేజోన్‌ను కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిందని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలను కలిశాకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అధికారంలోకి రావడానికి దశాబ్ధాలుగా ఎత్తిన పసుపుజెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమ దాగి ఉందని గుర్తు చేశారు. 2019-24 నడుమ సైకో పాలన చూశాం, బయటకు రావాలంటే గేట్లకు తాళ్లుకట్టారు, నాపై ఎస్సీ,ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. యువగళం పాదయాత్ర చేస్తుంటే జీఓ 1 తెచ్చారు. అయినా నేను తగ్గలేదని లోకేశ్ పేర్కొన్నారు.

కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్పూర్తి: ప్రతిపక్షంలో ఉండగా అంజిరెడ్డి తాత నామినేషన్ పత్రాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తే తొడగొట్టి మరీ నామినేషన్ వేశారని లోకేశ్ అన్నారు. అదే విధంగా పల్నాడులో మంజులపై ప్రత్యర్థులు దాడి చేసినా సరే పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్సీపీ రిగ్గింగ్​ను అడ్డుకున్నారు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి అని లోకేశ్ పేర్కొన్నారు. పల్నాడులో తోట చంద్రయ్య అనే కార్యకర్తను మెడపై కత్తిపెట్టి వారి నాయకుడికి జై కొట్టమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారని, చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా 94 శాతం సీట్లను సాధించడం వెనుక మీ అందరి కష్టం, చెమట దాగి ఉన్నాయని లోకేశ్​ అన్నారు. వేదికపై ఉన్న నాయకులందరం అదృష్టవంతులమని, అయిదేళ్లు మీరు మా వెంట నిలిచారని, నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలే అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబుని 53రోజులు జైల్లో పెడితే అండగా నిలబడి బయటకొచ్చి పోరాడింది కార్యకర్తలేనని, అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంత అద్భుతమైన కార్యకర్తలు టీడీపీకి మాత్రేమే సొంతమని, ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతమని అన్నారు.  

పార్టీలో చిన్నచిన్న సమస్యలు ఏవైనా ఉంటే చర్చించుకుని మనలో మనమే చర్చించుకుని పరిష్కరించుకుందామని లోకేశ్‌ కార్యకర్తలకు సూచించారు. కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. అలక జబ్బు పార్టీలో ఉందని, మనమే దానివల్ల నష్టపోతున్నామని చురకంటించారు. గ్రూపు రాజకీయాలు విడనాడాలని హితవు పలికారు. మనందరికీ చంద్రబాబు సేనాధిపతని.. సైనికులుగా ఆయన వెంట నడవాల్సిన బాధ్యత మనపై ఉందని తేల్చిచెప్పారు. టీడీపీ కార్యకర్త కోరుకునేది గౌరవం మాత్రమేనన్నారు. ప్రతి పనికి లోకేశ్, ఎమ్మెల్యేలు ఫోను చేయాలంటే కుదరదని, చట్టబద్ధంగా ఉన్న ఏ పని అయినా కార్యకర్తలు చెబితే అధికారులు చేయాల్సిందేనని సూచించారు. మైటీడీపీ యాప్‌ ద్వారా క్యాడర్‌కు బాధ్యతలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు.