Responsive Header with Date and Time

బాలయ్యా మజాకా! అఖండ 2తో రికార్డు క్రియేట్ చేసిన బాలకృష్ణ

Category : వినోదం | Sub Category : movies Posted on 2025-12-05 22:12:30


బాలయ్యా మజాకా! అఖండ 2తో రికార్డు క్రియేట్ చేసిన బాలకృష్ణ

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, వీరిలో ఒకరు మాత్రం తన కెరీర్ చివరి దశలో ఒక అరుదైన మైలురాయిని అందుకుని, తన తరం హీరోలకు అసాధ్యమైన రికార్డును సృష్టించారు.

ఇంతకీ ఎంటా రికార్డు? ఆ రికార్డు మరేదో కాదు… నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ 2 తాండవం’తో బాలయ్య సొంతమైన రికార్డు అది! మరి, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హేమాహేమీలు కూడా చేయలేని ఆ రికార్డును బాలయ్య ఎలా చేసి చూపించారు? ‘అఖండ 2’ తో ఆయన నెలకొల్పిన ఆ ప్రత్యేకమైన రికార్డు ఏంటి?


బాలకృష్ణ తన తరం హీరోలకు సాధ్యం కాని అతి ముఖ్యమైన రికార్డును సృష్టించారు. అదేంటంటే, ‘అఖండ 2 తాండవం’ హిందీ వెర్షన్‌లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలకృష్ణ నిలిచారు. చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’తో పాన్ ఇండియా సినిమా చేసి ఉన్నా, నాగార్జున, వెంకటేష్‌లు డైరెక్ట్ హిందీ సినిమాలు చేసినప్పటికీ వారిలో ఎవరూ కూడా తమ తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు.

యువ హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నప్పటికీ, సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఒక్కమగాడు బాలకృష్ణ మాత్రమే కావడం విశేషం. అంతేకాదు, గతంలో ‘భగవంత్ కేసరి’ హిందీ డబ్బింగ్‌కు కూడా ఆయనే డబ్బింగ్ చెప్పారు.

బాలకృష్ణ తన తరం హీరోలలో మరొక విషయంలోనూ రికార్డు సృష్టించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలేవి ఇప్పటివరకు 3D ఫార్మాట్‌లో విడుదల కాలేదు. కానీ బాలకృష్ణ నటించిన ‘అఖండ 2 తాండవం’ చిత్రం 3Dలో విడుదల కాబోతోంది. ఇది టెక్నాలజీ పరంగా ఆయన కెరీర్‌లో ఒక కొత్త మైలురాయి. విభిన్న పాత్రలతో మెప్పించడంలో బాలకృష్ణ తన సీనియర్ హీరోలందరికంటే ముందున్నారు.

‘అఖండ 2’ సహా, ‘అధినాయకుడు’ వంటి సినిమాలతో కలిపి ఆయన ఏకంగా 19 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. చిరంజీవి (14), వెంకటేష్ (8), నాగార్జున (4) కూడా ద్విపాత్రాభినయం చేసినప్పటికీ బాలయ్య రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. ఆరు పదుల వయస్సులోనూ కొత్త ట్రెండ్‌లను సెట్ చేస్తూ, పాన్ ఇండియా డబ్బింగ్ వంటి సాహసోపేతమైన పనులు చేస్తూ బాలకృష్ణ ఈ తరం హీరోలకూ ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు!