Category : ఆధ్యాత్మికం | Sub Category : సంప్రదయాలు Posted on 2025-12-05 22:24:48
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : దేవుళ్ల సొమ్ము దేవుళ్లకే.. ఆలయాల డబ్బుల్ని ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న కో-ఆపరేటివ్ బ్యాంకుల ఉద్దరణకు వాడొద్దని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధులను ఆలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. కేరళకు చెందిన కొన్ని సహకార బ్యాంకుల దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సహకార బ్యాంకుల మనుగడ కోసం ఆలయ నిధులను మళ్లించవద్దని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. కేరళలోని ఆలయాలకు భక్తులు చెల్లించిన నగదు, భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవస్థానం బోర్డు సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది… తీరా అవసరానికి ఇమ్మని అడిగితే ఆలయ అధికారులకు చుక్కలు చూపిస్తోంది.. సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.. హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి సహకార సంఘాల బ్యాంకులు.. దీంతో సుప్రీంకోర్టు సహకార సంఘాల పిటిషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలోని తిరునెల్లి మహావిషు ఆలయానికి చెందిన 18 కోట్ల నగదును సహకార సంఘాల బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది దేవస్థానం బోర్డు. డిపాజిట్ గడువు తీరాక నిధులను విత్ డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఆలయ బోర్డుకు సహకార సంఘాల బ్యాంకులు షాక్ ఇచ్చాయి.. తమ కోపరేటివ్ సొసైటీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీ డిపాజిట్లు ఇప్పట్లో ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి.. దీంతో ఆలయ అధికారులకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు మొత్తం డిపాజిట్ల నుంచి రెండేళ్లలో 9 కోట్లు ఎలాగోలా విత్ డ్రా చేసుకున్నారు. ఇక మిగిలిన 9 కోట్లు, వడ్డీ రూ 1.13 కోట్లు మహా విష్ణు ఆలయ బోర్డుకు సహకార సంఘాలు బాకీ పడ్డాయి.. అప్పటి నుంచి ఎన్ని సార్లు అడిగినా ఉపయోగం లేకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారు.. అయినా ఎలాంటి ప్రయత్నం లేదు.. తర్వాత కేరళ హైకోర్టులో నెలల తరబడి విచారణ తర్వాత 2025 ఆగస్టులో దేవస్థానం బోర్డుకు అనుకూలంగా కేరళ హైకోర్టు తీర్పును ఇచ్చింది.. ఆలయానికి సంబంధించిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. కానీ కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.. కేరళ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సహకార సంఘాల బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి మాల్య ధర్మాసనం ఈ సందర్భంగా కోపరేటివ్ సొసైటీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయం కోసం భక్తుల సమర్పించిన నగదు, ఆదాయం ఆలయ నిర్వహణ కోసం ఆలయ అభివృద్ధి కోసం వాడాలని.. ఆ నగదు దేవునికి సంబంధించిందని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామన్న కారణంతో కోఆపరేటివ్ బ్యాంకుల మనుగడకు లేదా ఆదాయ మార్గంగా ఎలా ఆడుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నిధులను ఆలయ అభివృద్ధి, సంరక్షణకు మాత్రమే వినియోగించాలని, జాతీయ బ్యాంకుల్లో పెట్టి ఎక్కువ వడ్డీ దేవస్థానం బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించింది.
తిరునెల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్, మనంతవాడి కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్, సుశీలా గోపాలన్ స్మారక వనితా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మనంతవాడి కోఆపరేటివ్ రూరల్ సొసైటీ లిమిటెడ్, వయనాడ్ టెంపుల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వంటి బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను రెండు నెలలోపు తిరిగి ఆలయ బోర్డుకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
సహకార సంఘాలు ఏర్పడింది పొదుపుదారుల నుంచి సేకరించిన డిపాజిట్లను తక్కువ వడ్డీలకు వ్యాపారాలకు వ్యవసాయానికి రుణాలు ఇవ్వడం, స్థానిక అభివృద్ధికి పనిచేయడం ఉద్దేశం అయినప్పుడు బ్యాంకుల పేరు వాడుకునే అధికారం కూడా మీకు లేదని డిపాజిట్లు సేకరించడం కూడా కోపరేటివ్ సొసైటీల నిబంధనలకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ బోర్డు డిపాజిట్లను ఎక్కువ వడ్డీ వచ్చే జాతీయ బ్యాంకులలో డిపాజిట్లు చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని దైవ కార్యక్రమాలకు ఆలయ నిర్వహణకు ఉపయోగించాలని సూచించింది.