Responsive Header with Date and Time

గంగానదీ పాపాలు కూడా కడిగేసిన హంసలదీవి! దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఆలయం

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-12-05 22:28:51


గంగానదీ పాపాలు కూడా కడిగేసిన హంసలదీవి! దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఆలయం

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : హిందూ సంప్రదాయం ప్రకారం గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోయి పునీతులు అవుతారని విశ్వాసం. కానీ సాక్షాత్తు గంగమ్మ కూడా పాపవిమోచనం పొందిన పవిత్ర ప్రదేశం ఎక్కడుందో తెలుసా! సాగర సంగమ ప్రదేశంలో దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించిన ఓ మహామాన్విత ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం - హంసలదీవి
కృష్ణా జిల్లా సాగర సంగమం ప్రదేశం హంసలదీవి లో పాపవిమోచన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం శ్రీ రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం. సంతానం లేని వారు ఈ స్వామికి మొక్కుకుంటే ఏడాదిలోపు సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామిని సంతాన వేణుగోపాలస్వామి అని కూడా అంటారు.

సాగర సంగమం అంటే?
సాధారణంగా నది సాగరంలో కలిసే ప్రదేశాన్ని సాగర సంగమం అంటారు. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన కృష్ణానది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎన్నో ప్రాంతాలను సశ్యశ్యామలం చేస్తోంది. అలాంటి పవిత్ర కృష్ణానదిలోని ఒక పాయ కృష్ణా జిల్లా కోడూరు సమీపంలోని హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నది సముద్రంలో కలిసే చోటు ఎంతో పవిత్రమైనది. ఇలాంటి పవిత్ర సాగర సంగమంలో స్నానం ఆచరిస్తే జన్మాంతర పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

హంసలదీవి ప్రత్యేకత
కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. పురాణాల ప్రకారం దేవతలు ఈ సంగమ ప్రాంతంలో స్నానం చేసి వేణుగోపాలస్వామిని ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. అలాగే పాపాలు కడిగేసే గంగమ్మ తల్లి కూడా ఈ పవిత్ర సంగమ ప్రాంతంలో స్నానమాచరించి తన పాపాలు పోగొట్టుకున్నట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంత విశిష్టమైన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

స్థల పురాణం
అనాదిగా ప్రజలందరూ గంగానదిలో స్నానం చేసి తమ పాపాలు పోగొట్టుకుని పునీతులవుతుండేవారు. అయితే రోజురోజుకు గంగమ్మకు పాపభారము పెరిగిపోసాగింది. దాంతో గంగమ్మ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది.

గంగకు పాపపరిహారం సూచించిన విష్ణువు
తనకు పాప భారాన్ని పోగొట్టమని కోరిన గంగాదేవితో శ్రీ మహావిష్ణువు \"పాపాలకు ప్రతిరూపం నలుపురంగు. కాబట్టి నువ్వు నల్లని రంగులో ఉండే కాకి రూపాన్ని ధరించి భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చెయ్యి... ఎక్కడైతే నీ నలుపురంగు పోయి తెలుపు రంగు వస్తుందో అప్పుడే నీకు పాపాల నుంచి విముక్తి కలిగి మోక్షం కలుగుతుందని\" సూచిస్తాడు.

హంసలా మారిన కాకి
శ్రీ మహా విష్ణువు సూచన మేరకు గంగ కాకి రూపంలో భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ హంసలదీవి లో సాగరసంగమం చేరుకొని అక్కడ కూడా స్నానం చేసింది. హంసలదీవి లో సాగర సంగమం లో మునిగిన వెంటనే నల్లని కాకి రూపంలో ఉన్న గంగమ్మ తెల్లని హంసలా మారిపోయింది. అందుకే ఈ ప్రాంతానికి హంసలదీవి అని పేరు వచ్చింది.

దేవతలు నిర్మించిన ఆలయం
ఒకసారి గంగమ్మ పాపవిమోచనం పొందిన హంసలదీవిలో స్నానం చేయడానికి దేవతలంతా భూలోకానికి దిగివచ్చారు. వారు హంసలదీవిలో పుణ్యస్నానాలు చేసి అక్కడే రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామిని ప్రతిష్టించి ఒక్కరాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అయితే దేవతలు ఒకేఒక్క రాత్రిలో ఆలయాన్ని నిర్మిస్తుండగా కోడికూసే వేళకు వారిని ఒక మనిషి చూడడంతో వారంతా శిలలుగా మారిపోయారంట! ప్రస్తుతం ఆలయం కనిపించే శిల్పాలన్నీ దేవతల సజీవ శిల్పాలే అని పురాణాలు చెబుతున్నాయి. చాలారోజుల వరకు అసంపూర్తిగా ఉన్న ఆలయ రాజగోపురమే ఇందుకు నిదర్శనమని స్థానికులు చెబుతారు.

రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలు
హంసలదీవి పవిత్ర సాగరసంగమం ప్రాంతంలో దేవతలు ప్రతిష్టించిన రుక్మిణీ సమేత వేణుగోపాలస్వామి ఆలయం మహిమాన్వితమైనది. గర్భాలయంలో వేణుగోపాలస్వామి రుక్మిణీ సమేతంగా కొలువై ఉన్నాడు. 1995 ప్రాంతంలో ఈ ఆలయాన్ని బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు దత్తత తీసుకుని ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారు. సర్వాంగ సుందరంగా తయారైన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా స్వామివారి కల్యాణోత్సవం జరుగుతాయి. రెండు దశాబ్దాల క్రితం వరకు అనంతవరం కుప్పా వంశస్థులు ఈ ఆలయ నిర్వహణ చూసుకుంటూ, ప్రతిఏటా కల్యాణోత్సవాలను నిర్వహిస్తుండేవారు.