Responsive Header with Date and Time

ఆరు గ్రాముల చైన్.. ఆరున్నర గ్రాములు తూగింది..

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-11-26 00:14:22


ఆరు గ్రాముల చైన్.. ఆరున్నర గ్రాములు తూగింది..

తెలుగు వెబ్ మీడియా:

తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో చీరాలలో కొందరు బంగారు నగల వ్యాపారుల ఘరానా మోసం బట్టబయలైంది. బంగారం తూకం వేసే క్రమంలో వ్యత్యాసాన్ని గుర్తించారు. నగల వ్యాపారికి రెండు లక్షల జరిమానా విధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాపట్ల జిల్లా తూనికలు, కొలతల శాఖ శాఖ జాయింట్ కంట్రోలర్ మాధురీ, సహాయ కంట్రోలర్ లిల్లీ, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు చీరాలలోని ఓ నగల షాపునకు వచ్చారు. అక్కడ ఓ నగకు చెందిన ట్యాగులో ఉన్న తూకం విలువను గుర్తించారు. ఆ నగను వాస్తవంగా తూకం వేశారు. అయితే దీంతో వ్యత్యాసం కనిపించింది. ఈ వ్యత్యాసం 250 నుంచి 300 వరకు మిల్లీ గ్రాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మోసానికి పాల్పడుతున్న నగల వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఇప్పటివరకు ఆ నగల దుకాణంలో బంగారం కొనుగోలు చేసిన వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.


చీరాల నెహ్రు కూరగాయల మార్కెట్ సమీపంలోని పేరుమోసిన ఓ జ్యువెలర్స్ షాపులో ఆరు గ్రాముల బంగారు నగ ఆరున్నర గ్రాములు తూగింది. అంటే జ్యువెలర్స్ షాప్ నిర్వాహకులు తూకం వేసే ఎలక్ట్రానిక్‌ కాటాలో టాంపరింగ్‌ చేసినట్లు తూనికల కొలతల శాఖ అధికారులు గుర్తించారు. షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులను ఈ విషయంగా వివరణ కోరగా “వెంకటరమణ జ్యువెలర్స్”లో తనిఖీలు చేశామని, తనిఖీలలో తూకంలో తేడాలు గుర్తించిన మాట వాస్తవమైనన్నారు. ఇందుకు గానూ “వెంకటరమణ జ్యువెలర్స్” నిర్వాహకులకు రెండు లక్షల రూపాయల మేర జరిమానా విధించగా జరిమానా కట్టారని తెలిపారు… అయితే అధికారుల తనిఖీలలో తూకంలో తేడాలు బహిర్గతం కావడంతో ఇలా ఎన్ని రోజులు నుంచి కొనుగోలుదారులను మోసం చేస్తూ ధనార్జన చేస్తున్నారో.. అనే ప్రశ్న తెలెత్తుతుంది. మరోవైపు ఈ తరహా మోసాలకు జరిమాలతో ఎలా సరిపెడతారు. కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలి కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.