Responsive Header with Date and Time

కోట్లు పలికిన స్టార్ ప్లేయర్లు..

Category : క్రీడలు | Sub Category : sports Posted on 2025-11-28 00:08:44


 కోట్లు పలికిన స్టార్ ప్లేయర్లు..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ :మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ అంచనాలకు మించి జరిగింది. ఈసారి వేలంలో జట్లు డబ్బును ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చు చేశాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు, మ్యాచ్ విన్నర్‌ల కోసం ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను కుమ్మరించాయి. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అంచనాలకు తగ్గట్టే అత్యధిక ధర పలికింది. ఆమెతో పాటు మరో నలుగురు స్టార్ క్రీడాకారులపై కోట్లలో ఎలా డబ్బుల వర్షం కురిసిందో, ఏ జట్టు ఎంత వెచ్చించిందో వివరంగా తెలుసుకుందాం.

దీప్తి శర్మ (రూ.3.2 కోట్లు) – యూపీ వారియర్స్

భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఈ మెగా ఆక్షన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. రూ.50 లక్షల బేస్ ధరతో మొదలైన ఆమె బిడ్ వేగంగా కోట్లకు చేరుకుంది. చివరికి యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ ఆమెను ఏకంగా రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమెకున్న అనుభవం, ముఖ్యంగా మ్యాచ్‌లను ముగించే కెపాసిటీ, బంతితో ఆమె నిలకడైన ప్రదర్శన కారణంగా ఫ్రాంచైజీలు ఆమె కోసం దూకుడుగా బిడ్ వేశాయి.

ఎమిలియా కెర్ (రూ.3 కోట్లు) – ముంబై ఇండియన్స్

న్యూజిలాండ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ ఎమిలియా కెర్ ఈ వేలంలో విదేశీ క్రీడాకారులలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచింది. రూ.50 లక్షల బేస్ ధరతో మొదలైన ఈ బిడ్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరకు ముంబై ఇండియన్స్ ఆమెను రూ.3 కోట్లకు దక్కించుకుంది. బ్యాటుతో, బంతితో మ్యాచ్ గమనాన్ని మార్చగలిగే ఆమె కెపాసిటీ ఆమెను ఇంత ఖరీదైన ఆల్‌రౌండర్‌గా మార్చింది.

శిఖా పాండే (రూ.2.4 కోట్లు) – యూపీ వారియర్స్

సీనియర్ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే పై కూడా యూపీ వారియర్స్ నమ్మకముంచి పెద్ద మొత్తం ఖర్చు చేసింది. ఆమెను రూ.2.4 కోట్లకు యూపీ జట్టులోకి తీసుకుంది. ఆమె స్వింగ్, లైన్-లెంత్ , ఒత్తిడిలో ప్రశాంతంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం కారణంగా యూపీ వారియర్స్ ఆమెను దక్కించుకోవడానికి ఆసక్తి చూపింది. శిఖా పాండే రాకతో యూపీ బౌలింగ్ దళం మరింత బలంగా తయారైంది.

సోఫీ డివైన్ (రూ.2 కోట్లు) – గుజరాత్ జెయింట్స్

న్యూజిలాండ్‌కు చెందిన మరో అద్భుతమైన ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‎ను గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆమె మెరుపు పవర్-హిట్టింగ్, మీడియం పేస్ బౌలింగ్ టీ20 ఫార్మాట్‌లో ఆమెను ఒక మ్యాచ్-విన్నర్‌గా నిలబెడుతుంది. సోఫీ డివైన్ చేరికతో గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా కనిపిస్తోంది.

మెగ్ లానింగ్ (రూ.1.9 కోట్లు) – యూపీ వారియర్స్

ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్‎ను యూపీ వారియర్స్ జట్టు రూ.1.9 కోట్లకు తమ సొంతం చేసుకుంది. లానింగ్ అనుభవం, అద్భుతమైన కెప్టెన్సీ పటిమ క్లాసిక్ బ్యాటింగ్ శైలి WPL 2026లో యూపీ వారియర్స్‌కు చాలా కీలకం కానున్నాయి. ఈ వేలంలో జరిగిన అత్యంత తెలివైన కొనుగోళ్లలో లానింగ్‌ను దక్కించుకోవడం ఒకటిగా భావిస్తున్నారు.