Category : క్రీడలు | Sub Category : sports Posted on 2025-11-28 00:09:24
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు పరాభవం ఎదురైంది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓటమిపాలై 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. ఈ రెండో టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా ఆడకపోవడంతో, వైస్-కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును నడిపించాడు. సిరీస్ ఓటమి తర్వాత పంత్, టీమిండియా తరఫున అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అలాగే, జట్టు బలంగా, మరింత మెరుగ్గా తిరిగి వస్తుందని ఒక పెద్ద ప్రకటన చేశాడు.
సిరీస్ ఓటమికి పంత్ క్షమాపణ
భారత టెస్ట్ జట్టు వైస్-కెప్టెన్ రిషబ్ పంత్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమిపాలైంది. గౌహతిలో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో, పంత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డు స్థాయిలో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే భారత అవకాశాలకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ సిరీస్ సమయంలో పంత్ కూడా తన షాట్ ఎంపికలో నిర్లక్ష్యం వహించాడని విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఎక్స్ వేదికగా పంత్ పోస్ట్
రిషబ్ పంత్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో గత రెండు వారాలుగా మేము మంచి క్రికెట్ ఆడలేదనే వాస్తవాన్ని కాదనలేము. ఒక జట్టుగా, వ్యక్తిగత ఆటగాళ్లుగా, మేము ఎల్లప్పుడూ మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని, కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటామని పంత్ పేర్కొన్నారు.
ఈసారి మేము మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నాను. కానీ ఆట అనేది ఒక జట్టుగా, ఆటగాడిగా నేర్చుకోవడానికి, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, ముందుకు సాగడానికి అవకాశం ఇస్తుంది. ఈ జట్టు ఏమి చేయగలదో మాకు తెలుసు. మేము మరింత బలంగా, మెరుగ్గా తిరిగి రావడానికి మళ్లీ ఏకమై కఠినంగా శ్రమిస్తామని పంత్ అభిమానులకు, జట్టుకు పెద్ద హామీ ఇచ్చాడు. పంత్ తన పోస్ట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆటగాళ్ల జీవితంలో అతిపెద్ద గౌరవమని కూడా చెప్పాడు. భారత్ తరువాతి టెస్ట్ మ్యాచ్‌ను వచ్చే సంవత్సరం వరకు ఆడదు.