Category : జీవనశైలి | Sub Category : life style Posted on 2025-11-28 00:20:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :స్నానం అనేది కేవలం శుభ్రత కోసం చేసే పని కాదు.. ఇది శరీరం, మనస్సు అలసటను దాదాపు సగం వరకు తొలగించి, ప్రశాంతంగా ఉంచే ఒక దినచర్య. చాలా మంది ఉదయం స్నానం చేసినా మరికొందరు రోజంతా పడిన శ్రమ, ఒత్తిడిని తొలగించుకోవడానికి రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తుంటారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, కొన్ని నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
రాత్రి స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు
రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా మెదడు, చర్మానికి ఇది ఒక వరంలా పనిచేస్తుంది. రాత్రి సరిగా నిద్ర పట్టని వారికి రాత్రి స్నానం అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆ తర్వాత శరీరం చల్లబడే క్రమంలో మెదడు విశ్రాంతి సంకేతాన్ని అందుకుంటుంది. ఇది ఆలోచనలను తగ్గించి, శరీరాన్ని నిద్రకు సిద్ధం చేస్తుంది. అందుకే మంచి నిద్ర కోసం నిపుణులు రాత్రిపూట స్నానం చేయాలని సలహా ఇస్తారు.
బిజీగా గడిపిన తర్వాత శరీరం, మనస్సు అలసిపోతాయి. రాత్రి స్నానం అనేది ఒక రకమైన డీటాక్స్ థెరపీ లాగా పనిచేస్తుంది. నీటి చల్లదనం లేదా వెచ్చదనం కండరాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గి, శరీరం ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా పేరుకుపోయిన కాలుష్యం, దుమ్ము, చెమట వల్ల రంధ్రాలు మూసుకుపోతే అలెర్జీలు, మొటిమలు వస్తాయి. రాత్రి స్నానం వల్ల ఇవన్నీ శుభ్రమై, చర్మం సహజంగా శుభ్రపడుతుంది. జుట్టులో పేరుకుపోయిన మురికి కూడా తొలగిపోయి, తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
రాత్రి స్నానం వల్ల వచ్చే నష్టాలు
రాత్రి స్నానం వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అది అసౌకర్యానికి దారితీయవచ్చు. కొంతమందికి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల జలుబు, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల పూర్తిగా ఆరకపోతే ఈ సమస్య పెరుగుతుంది. ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యల లక్షణాలను కూడా పెంచుతుందని చెబుతారు.
రాత్రిపూట స్నానం మంచి అలవాటే అయినప్పటికీ దాని వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జలుబు సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తల బాగా ఆరిన తర్వాతే పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.