Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-11-28 00:41:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ పట్టణం భువిపై వెలసిన కైలాసంగా ఖ్యాతికెక్కింది. కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని సాక్షాత్తూ ఆ పరమ శివుడే సెలవిచ్చాడు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలని అనుకుంటారు. అలాంటి కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు వ్యవహరిస్తున్నాడు. ఎవరీ కాలభైరవుడు? శివునికి ఆయనకు సంబంధమేమిటి? ఈ ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ కాలభైరవుడు?
హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవతలే కాదు వారి అంశగా జన్మించిన వారు కూడా వారితో సమానంగా పూజనీయులే! అలాంటి ఓ విశిష్టమైన దైవమే కాలభైరవుడు. మార్గశిర శుద్ధ అష్టమి రోజు కాలభైరవుడు శివుని శక్తిగా అవతరించినట్లుగా శివపురాణంలో వివరించి ఉంది. మార్గశిర శుద్ధ అష్టమినే కాలభైరవాష్టమి అని అంటారు. ఈ సందర్భంగా కాలభైరవుని జననం వెనుక ఉన్న ఆసక్తికరమైన గాథను తెలుసుకుందాం.
బ్రహ్మ మహేశ్వరుల సంవాదం
ఒకసారి బ్రహ్మ మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదన జరిగింది. ఈ చరాచర సృష్టికి మూలం పరమేశ్వరుడు కాబట్టే శివుడు తానే గొప్ప అని అనడం జరిగింది. కానీ బ్రహ్మ అందుకు అంగీకరించక సృష్టికర్త అయిన తానే గొప్ప అని వాదించడం మొదలు పెట్టాడు. ఈ సమస్య పరిష్కారం కొరకు చతుర్వేదాలను పిలుద్దాం అని వేదాలని పిలిచారు.
వేదాలు అంగీకరించిన శివశక్తి
రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం అనే నాలుగు వేదాలు పరబ్రహ్మం అయిన పరమ శివుడే గొప్ప అని తీర్మానించాయి. చివరకు ప్రణవం కూడా శివశక్తినే గొప్ప అని అంగీకరించింది. కానీ బ్రహ్మ మాత్రం శివుని ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. దానితో ఆగ్రహం చెందిన శివుడు తన అంశతో ఒక రుద్ర అవతారాన్ని సృష్టించాడు. పరమ శివుని ఆ రౌద్రావతారమే కాలభైరవ అవతారం. ఇదంతా జరిగింది మార్గశిర శుద్ధ అష్టమి కాబట్టి ఆ రోజు కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజు పరమ శివుని రుద్రావతారమైన కాలభైరవుని పూజించడం సంప్రదాయం. అయితే సౌరమానం, చాంద్రమాన సంప్రదాయాలను అనుసరించే విధానాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో కాలభైరవాష్టమిని కార్తిక బహుళ అష్టమి రోజు కూడా జరుపుకుంటారు.
ఈ ఏడాది కాలభైరవాష్టమి ఎప్పుడు? నవంబర్ 28, శుక్రవారం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు కాలభైరవాష్టమి జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.