Responsive Header with Date and Time

కేవలం ఒక దర్శనం చాలు- సకల గ్రహదోషాలను తొలగించే కాలభైరవ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-11-28 00:44:41


కేవలం ఒక దర్శనం చాలు- సకల గ్రహదోషాలను తొలగించే కాలభైరవ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా జరుపుకుంటాం. పరమేశ్వరుని రౌద్రావతారం కాలభైరవుడు. కాలభైరవ స్వామిని దర్శించినా, పూజించినా దుష్టశక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వాసం. అంతేకాదు కాలభైరవుని దర్శనంతో సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది. నవంబర్ 28, శుక్రవారం కాలభైరవాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా కాలభైరవుని ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

వారణాసి - ఉత్తర్​ప్రదేశ్
ప్రముఖ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాశిలో కాలభైరవుని ఆలయం ఉంది. కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది. శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు వ్యవహరిస్తున్నాడు.

ఉజ్జయిని -మధ్యప్రదేశ్​లో ఇందౌర్
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని ఆలయంలో కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది. ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం భక్తులు నైవేద్యంగా సమర్పించిన అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము.

దంతేవాడ, జగదల్​పుర్- ఛత్తీస్​గఢ్​
ఛత్తీస్​గఢ్​లోని జగదల్​పుర్ దంతేవాడలో కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పురాతన కాలం నాటి ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు పూజలందుకోవడం విశేషం. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించిన గోడలతో, పెంకులతో తయారైన పై కప్పుతో కనిపిస్తుంది. విశేషించి ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శనమిస్తారు. వారు వన భైరవుడు, జటా భైరవుడు, గదా భైరవుడు, తాండవ భైరవుడు.

తేజ్​పుర్, గువాహటి - అసోం
అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో తేజ్​పుర్​లో అతి పురాతన కాలభైరవ స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాచీనాలయంలోని స్వామి పేరు \'మహాభైరవుడు\'. ఇక్కడ కాలభైరవుడు లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తుంది. పూర్వం నాగులు ఈ లింగాన్ని పూజించాయని అంటారు. అందుకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్ప స్తంభాలు, ఆలయం ముందు ప్రవేశ ద్వారం పై భాగంలో సర్ప ప్రతిమలు దర్శనమిస్తాయి.