Category : ఆరోగ్యం | Sub Category : health Posted on 2025-11-30 22:07:39
తెలుగు వెబ్ మీడియా న్యూస్ :బరువు తగ్గాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ చాలామంది త్వరగా తగ్గాలనే ఆత్రంలో శరీరాన్ని శిక్షిస్తారు. రోజుకు 500–1000 క్యాలరీలు తినడం, జిమ్‌లో చచ్చేలా వర్కౌట్, రాత్రిపూట ఆకలితో కళ్లు పడుకోవడం.. ఇవన్నీ మొదట్లో ఫలితాలు చూపిస్తాయి. కానీ చివరికి అలసట, కోపం, హార్మోన్ల గందరగోళం, మళ్లీ బరువు పెరగడం తప్ప శాశ్వత ఫలితం కనిపించదు. క్యాలరీ డెఫిసిట్ పేరుతో చాలా మంది క్రాష్ డైట్ చేస్తున్నారు తప్ప, ఆరోగ్యకరమైన డెఫిసిట్‌లో లేరు. కొవ్వు తగ్గడానికి అతి ముఖ్యమైన శాస్త్రీయ పద్ధతి క్యాలరీ డెఫిసిట్.
ఒక వ్యక్తి శరీరం రోజులో ఖర్చు చేసే క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలు ఆహారం ద్వారా తీసుకుంటే, శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తి కోసం వినియోగించుకుంటుంది. దీన్నే క్యాలరీ డెఫిసిట్ అంటారు. అయితే, ఈ డెఫిసిట్ ఆరోగ్యకరంగా, స్థిరంగా ఉండాలి. లేదంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. క్యాలరీ డెఫిసిట్ సరైనదేనని తెలుసుకునేందకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ & పర్సనల్ ట్రైనర్ నటాలీ కాస్టెల్లన్ సూచిస్తున్న సంకేతాలేంటో తెలుసుకుందాం..
శరీర బరువు వారానికి 0.4 నుంచి 0.9 కేజీల మధ్య తగ్గితే మంచిదే. రోజుకు ±1 కేజీ హెచ్చుతగ్గులు వచ్చినా భయపడాల్సిన పని లేదు. నీరు, గ్లైకోజెన్, మలినాల వల్ల వస్తాయి. 3–4 వారాల తర్వాత కూడా ఇదే క్రమంలో బరువు తగ్గితే మీరు పాటించే డైట్ సరైనదే.
మధ్యాహ్నం, రాత్రి భోజనాల మధ్య 3–4 గంటలకు సమయంలో కడుపులో ఆకలి తెలుస్తుంది. ఇది సహజం, అలా జరిగితే శరీరం నిల్వ ఉన్న కొవ్వును వాడుతోందని సంకేతం. కానీ చేతులు వణుకడం, తలతిరగడం, చిరాకు, లేదా ఏదైనా తినకపోతే చచ్చిపోతాను అనిపిస్తే డెఫిసిట్ చాలా ఎక్కువైందని అర్థం.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు పని, వ్యాయామం, పిల్లలతో ఆటలు అన్నీ సాఫీగా చేయగలగాలి. మధ్యాహ్నం 3 గంటలకే కళ్లు మూసుకుపోతున్నాయి అనిపిస్తే కార్బ్స్ లేదా శరీరానికి క్యాలరీలు తక్కువయ్యాయని గ్రహించాలి.
శరీర బరువులో 5–10% తేడా కనిపింవచ్చు, కానీ 3–4 వారాల్లోనే మళ్లీ పైకి వెళ్లాలి. ఒక్కసారిగా 20–30% బలం తగ్గితే కావాల్సిన దానికంటే తక్కవ తింటున్నారు అని గ్రహించాలి.
ఒక్కోసారి చిరాకు లేదా లైట్ ఎమోషనల్ డౌన్ రావచ్చు, కానీ రోజూ ఏడుపు, కోపం, లేదా ఈ డైట్ వల్ల నా జీవితం నాశనమైంది అనే ఆలోచనలు వస్తే డెఫిసిట్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
10 నిమిషాల్లో నిద్రపట్టడం, రాత్రి మధ్యలో ఆకలితో మేలుకోకపోవడం, ఉదయం 6–7 గంటలకు సహజంగా కళ్లు తెరుచుకోవడం ఇవన్నీ ఆరోగ్యకరమైన డెఫిసిట్ గుర్తులు.
సాయంత్రం 6 గంటలకు ప్రోటీన్ షేక్ తాగాలి అని గుర్తుండటం సహజం. కానీ ప్రతి 10 నిమిషాలకు క్యాలరీ కాలిక్యులేటర్ తెరవడం, ఇతరులు తినే ఆహారం చూసి ఏడవడం అయితే అది మానసికంగా అనారోగ్యకరం.
రోజూ ఒకటి లేదా రెండుసార్లు సాధారణ మలవిసర్జన, కడుపు ఉబ్బరం తక్కువ, గ్యాస్ సమస్య లేకపోవడం ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందని తెలియజేసే సంకేతాలు.
పాత ఫోటోలతో పోల్చితే ముఖం సన్నగా కనిపించడం, బెల్ట్‌లో ఒక్కో రంధ్రం తగ్గుతూ వెళ్లడం, దుస్తులు వదులుగా అవడం, ఆత్మవిశ్వాసం సహజంగా పెరగడం ఇవన్నీ నిజమైన కొవ్వు తగ్గుదల సంకేతాలు.
ఈ డైట్ 6 నెలల తర్వాత ఆపేస్తాను అని అనిపించకూడదు. నేను జీవితాంతం ఇలాగే ఆరోగ్యంగా తినవచ్చు అనే భావన కలగాలి. అదే నిజమైన స్థిరత్వం. ‘బరువు తగ్గడం శిక్షలా అనిపిస్తే అది క్రమశిక్షణ కాదు, మీ ప్లాన్ పనిచేయడం లేదనే సంకేతం.’ అంటున్నారు నటాలీ. నెమ్మదిగా, సంతోషంగా, ఆరోగ్యంగా తగ్గడమే శాశ్వత ఫలితాలను ఇస్తుందని గ్రహించాలి.