Responsive Header with Date and Time

వామ్మో.. ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన యత్రాంగం..

Category : ఆంధ్ర ప్రదేశ్ | Sub Category : Breaking News Posted on 2025-11-30 22:11:35


వామ్మో.. ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన యత్రాంగం..

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : దిత్వా తుఫాను కారణంగా వర్షాల హెచ్చరికలతో సోమవారం తిరుపతి జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ప్రకటన విడుదల చేశారు. అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు దిత్వా తుఫాను కారణంగా సహాయకచర్యలలో ఉన్నందువలన ప్రజలెవ్వరికీ ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా రద్దు చేశామన్నారు. జిల్లాలోని ప్రజలందరూ గుర్తించి జిల్లా, రెవెన్యు, మండల కేంద్రాలకు వెళ్లరాదన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎస్పీ సూచించారు.వాగులు, వంకలు, చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లకు దూరంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో అవసరం లేని ప్రయాణాలు మాను కోవాలన్నారు. నీటి ప్రవాహం, నిల్వ ఉండే ప్రదేశాలకు పిల్లలను అనుమతించ కూడదన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన, తీగలు పడిపోయిన ప్రాంతాలకు వెళ్లరాదని సూచిస్తున్నారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు, వీడియోలు, సెల్ఫీ లు తీయడం పూర్తిగా నిషేధమన్నారు ఎస్పీ సుబ్బారాయుడు.

తుఫాను ప్రభావం ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర అవసరాలకే బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా వాగులు, వంకలు, కల్వర్ట్లు, బ్రిడ్జిల వద్ద నీటి మట్టం పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. భారీ వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ప్రాంతాలు, తీగలు తెగి పడిన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు, ఫైర్ సర్వీసులు, 108 అంబులెన్స్‌తో పాటు SDRF, NDRF బృందాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండగా, ప్రమాద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు పహారా, పర్యవేక్షణ నిరంతరం కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు.

వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగిన.. ఎవరికైన అత్యసవ సహాయం ఏర్పడిన తిరుపతి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 80999 99977 ఎమర్జెన్సీ నంబర్: 112 తిరుపతి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0877-2236007 నెంబర్‌లను సంప్రదించాలని సూచించారు.