Responsive Header with Date and Time

సర్పంచ్ పదవి కోసం వేలం పాట.. రూ.73 లక్షలతో ఈ మహిళ చేసిన పని చూస్తే షాకింగ్

Category : తెలంగాణ | Sub Category : Politics Posted on 2025-11-30 22:31:14


సర్పంచ్ పదవి కోసం వేలం పాట.. రూ.73 లక్షలతో ఈ మహిళ చేసిన పని చూస్తే షాకింగ్

తెలుగు వెబ్ మీడియా న్యూస్ : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? తమ గ్రామంలో పోటీ ఎలా ఉంది..? తమ సర్పంచ్ ఎవరు అవుతారు? అనేది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ టికెట్ పొందేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామాల్లో పలుకుబడి కోసం లక్షలు లక్షలు కోసం ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు సర్పంచ్ అభ్యర్థులు సిద్దమవుతున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పలు ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా పోటీ ఉన్న గ్రామాల్లో వేలం పాటలు వేసుకుని సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేస్తున్నారు.

తాజాగా నల్లగొండ జిల్లాలోని బంగారిగెడ్డ, ములకలపల్లి గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై వేలం పాటలు నిర్వహించారు. వేలంలో బంగారిగెడ్డి సర్పంచ్ స్థానాన్ని మహ్మద్‌ సమీనా ఖాసిం అనే మైనార్టీ మహిళ ఏకంగా రూ.70 లక్షలకు దక్కించుకుంది. ఈ స్థానం మహిళలకు కేటాయించారు.  ఆదివారం గ్రామ పెద్దల సమక్షంలో ఈ వేలం పాట నిర్వహించగా.. ఆమెకు కైవసమైంది. ఈ డబ్బులను గ్రామంలో కనకదుర్గ దేవాలయ నిర్మాణానికి ఆమె విరాళంగా ఇచ్చారు. ఇక ములకలపల్లి గ్రామ సర్పంచ్‌ పదవికి జరిగిన వేలంలో బొడ్డుపల్లి లింగస్వామి అనే అభ్యర్ధి రూ.19 లక్షలకు దక్కించుకున్నారు. ఈ నగదును గ్రామంలోని రామాలయం నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో ముగ్గురు అభ్యర్థులు కనకదుర్గ ఆలయానికి నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో గ్రామం అభివృద్ది ముఖ్యమని భావించి పెద్దలు వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో మహమ్మద్ సమీనా ఖాసీం గెలవడంతో.. మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ స్ధానం ఏకగ్రీవమైంది. అయితే అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.