Category : ఆధ్యాత్మికం | Sub Category : భక్తి Posted on 2025-11-30 22:35:09
తెలుగు వెబ్ మీడియా న్యూస్ : హైందవ ధర్మం అనుసరించి ఈ లోకంలో పవిత్రమైన గ్రంథాల్లో ఒకటి \'భగవద్గీత\'. ఎందుకంటే మానవులందరికీ మార్గదర్శిలా, దిక్సూచిలా జీవన మార్గాన్ని చూపడంలో ఈ పవిత్ర గ్రంథం ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వాసం. అలాంటి భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకోవడం మన సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ ఏడాది గీతా జయంతి ఎప్పుడొచ్చింది? గీతా జయంతి విశిష్టత ఏమిటి? అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గీతా జయంతి ఎప్పుడు?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఇదే రోజున మోక్షదా ఏకాదశి కూడా జరుపుకోవడం విశేషం. ఈ రోజు ప్రత్యేకించి పూజలేమీ చేయకయినా భగవద్గీతను అందించిన శ్రీకృష్ణుని పూజించడం, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను పారాయణ చేయడం ఉత్తమం. ఈ సందర్భంగా భగవద్గీతలోని ముఖ్య సారాంశాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గీతాసారం మహా సాగరం
భగవద్గీత ఒక్క రోజులో తెలుసుకునేది కాదు. కొన్ని శ్లోకాలు పఠిస్తే అర్ధమయ్యేది కాదు. ఇది మహాసాగరం. ఈ సాగరం నుంచి ఒక్క బిందువును గ్రహించగలిగినా ధన్యులమే! భగవద్గీత అంటే జీవితమే! ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో తెలిపేది భగవద్గీత మాత్రమే! పెద్దలు అనుభవంతో ఒక మాట చెప్తారు. అదేమిటంటే మనకేదైనా క్లిష్టమైన సమస్య కానీ దుఃఖం కానీ ఎదురైతే ఆ సమయంలో ఒక్కసారి భగవద్గీతను కళ్ళు మూసుకొని తెరచి ఎదురుగా కనిపించిన పేజీని చూస్తే అందులో మన సమస్యకు సమాధానం దొరుకుతుందంట! బహుశా అందుకే కాబోలు భగవద్గీతను మార్గదర్శి అంటారు.
గీత అంటే?
పురాణాల ప్రకారం, గీత అనే రెండక్షరాల్లో ఎంతో శక్తి ఉంది. \'గీ\' అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. \'త\' అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మ స్వరూపాన్ని ఉపదేశిస్తుంది. అంటే త్యాగానికి యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేదా సర్వ సంగపరిత్యాగమనీ దాని అర్థం.